Lamborghini Huracán LP 610-4 t
Teluguworld.wap.sh









విడుదల తేదీ : 24 డిసెంబర్ 2014
TeluguArea.com : 2.75/5
దర్శకుడు : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : ఠాగూర్ మధు, నల్లమల్లపు శ్రీనివాస్
సంగీతం : మిక్కి జె మేయర్
నటీనటులు : వరుణ్ తేజ్, పూజా హెడ్గే, రావు రమేష్, ప్రకాష్ రాజ్..

మెగా ఫ్యామిలీ నుండి మరో కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు అంటే ప్రేక్షకులలో ఓ అంచనాలు ఏర్పడతాయి. వాటికి తోడు ఆరడుగుల ఎత్తు, చక్కని రూపం, అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకునే అందంతో వరుణ్ తేజ్ తొలిచూపులోనే ఆకర్షించాడు. దాంతో ‘ముకుంద’ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెడ్గే ఈ సినిమాలో కధానాయిక. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ‘ముకుంద’ను నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందొ ఈ సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ :
ముకుంద(వరుణ్ తేజ్) మార్కెట్ యార్డులో ఉల్లిపాయలు అమ్ముకునే ఒక సామాన్య వ్యాపారి కొడుకు. తన స్నేహితుడు అర్జున్ స్థానిక మున్సిపల్ చైర్మెన్ (రావు రమేష్) తమ్ముడి కూతురిని ప్రేమిస్తాడు. అర్జున్ కు మున్సిపల్ చైర్మెన్ & వారి గుండాల నుండి ఎటువంటి ఆపద లేకుండా కాపాడుతుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు మున్సిపల్ చైర్మెన్ కూతురు పూజా హెడ్గేను చూసి ప్రేమిస్తాడు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. 25 సంవత్సరాల నుండి ఎన్నికలలో రావు రమేష్ దే విజయం. అధికార బలం చూసుకుని అహంకార పూరిత ధోరణితో వ్యవహరిస్తున్న రావు రమేష్ ఆగడాలకు ముకుంద అడ్డుకట్ట వేయలనుకుంటాడు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా చికాకు తెప్పిస్తున్న ‘ముకుంద’ అడ్డు తొలగించుకోవాలని రావు రమేష్ ప్రణాళికలు రచిస్తాడు.

ఈ సంగ్రామంలో ఎవరు విజయం సాదించారు..? రావు రమేష్ పై మున్సిపల్ ఎన్నికలలో ‘ముకుంద’ & కో విజయ కేతనం ఎగురవేశారా..? లేదా..? తను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకున్నాడా..? లేదా..? అనేది మిగతా సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
‘ముకుంద’తో తను హీరో మెటీరియల్ అని వరుణ్ తేజ్ నిరూపించాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ ను తెరపై చూపించిన విధానం బాగుంది. హీరో పాత్రకు డైలాగులు చాలా తక్కువ. కళ్ళతోనే చాలా భావాలు పలికించాడు వరుణ్ తేజ్. హీరో స్మైల్, లుక్స్ తదితర అంశాలను ఎలివేట్ చేసేలా కథను రాసుకున్నారు. ముఖ్యంగా వరుణ్ హైట్ కు తగ్గట్లు ఫైట్స్ ను డిజైన్ చేశారు. యాక్షన్ సన్నివేశాలలో హీరో పెర్ఫార్మన్స్ బాగుంది. చిరంజీవి పెట్టిన ‘మెగా ప్రిన్స్’ బిరుదుకు వరుణ్ తేజ్ తొలి సినిమాతో న్యాయం చేశాడు.

‘ముకుంద’ సరసన గోపికమ్మలా పూజా హెడ్గే తన నటనతో ఆకట్టుకుంది. పాటల్లో యువత కలల రాకుమారిలా ఆమెను చూపించారు. అందమైన నటనతో పూజా హెడ్గే మాయ చేసింది. తొలి సినిమా ‘ఒక లైలా కోసం’ కంటే ఈ సినిమాలో పూజా హెడ్గే పెర్ఫార్మన్స్ సూపర్బ్ గా ఉంది. మునిసిపల్ చైర్మన్ పాత్రలో రావు రమేష్ కుటిల నీతి ప్రదర్శించే కౌసల్యుడిలా చక్కని నటన కనబరిచారు. ప్రతి సినిమాలో కాస్త అతి చేసే రావు రమేష్ ఈ సినిమాలో సెటిల్ పెర్ఫార్మన్స్ చేశారు. వరుణ్ తేజ్, రావు రమేష్ మధ్య సన్నివేశాలు బాగున్నాయి. కీలకమైన పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ తెరపై కనిపించింది కొద్ది సమయమే అయినా తన డైలాగులు, పెర్ఫార్మన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :
శ్రీకాంత్ అడ్డాల ఈ తరహా కథతో సినిమా తెరకేక్కిస్తారని ప్రేక్షకులు ఊహించలేదు. ఈ సినిమాకు కథ మేజర్ మైనస్ పాయింట్. గత సినిమాలలో మనసును హత్తుకునే సన్నివేశాలతో చక్కని కథ రాసుకున్న శ్రీకాంత్, ‘ముకుంద’ విషయంలో తడబడ్డారు. హీరోని బాగా ప్రెజెంట్ చేసినా, అతుకుల బొంత లాంటి కథతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంటర్వెల్ వరకూ కథను ఆసక్తికరంగా నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో ఆ మేజిక్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ముఖ్యమైన కథనంతా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మీద ఫోకస్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

‘ముకుంద’ టైటిల్, సాంగ్స్ చూసి సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. హీరో హీరోయిన్ల మధ్య లవ్, రొమాంటిక్ సన్నివేశాలు కాదు కదా, కనీసం మాటలు కూడా లేవు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లవ్ ట్రాక్ హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ను డామినేట్ చేసింది. హీరోయిన్ ను కేవలం పాటలకు పరిమితం చేసేశారు. హీరోకి స్నేహితుడు అర్జున్ అంటే ఎందుకు అంత ఇష్టమో..? హీరో లక్ష్యం ఏంటో..? సరిగా చూపించలేదు. సినిమాకు సరైన ముగింపు ఇవ్వలేదు.

సినిమా అంతా చాలా సీరియస్ గా సాగుతుంది. కామెడీ సన్నివేశాలకు కథలో మంచి ప్రాముఖ్యత ఉన్నా దర్శకుడు వాటిపై సరిగా దృష్టి సారించలేదు. ఒక్క సన్నివేశంలో కూడా నవ్వించలేకపోయాడు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు కూడా లేకపోవడం మరో మైనస్

సాంకేతిక విభాగం :
‘ముకుంద’ సినిమాకు మరో మెయిన్ హీరో మిక్కి జె మేయర్. తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు. సినిమా విడుదలకు ముందే మిక్కి జె మేయర్ ఆడియో హిట్టయ్యింది. సిరివెన్నెల సాహిత్య విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. పాటలతో పాటు వాటిని చిత్రీకరించిన విధానం బాగుంది. నేపధ్య సంగీతంతో సాధారణ సన్నివేశాలను కూడా బాగుందనేలా చేశాడు మిక్కి. మణికందన్ సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ పెయింటింగ్ లా కనువిందు చేసింది. వరుణ్ తేజ్, పూజా హెడ్గేలను అందంగా చూపడమే కాదు.. గోదావరి, స్విస్ అందాలను తన కెమెరా కంటిలో బాగా బంధించాడు. నిర్మాణ విలువలు భారి స్థాయిలో ఉన్నాయి. మెగా వారసుడి తొలి సినిమా కావడంతో నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా రాజీపడలేదు. పాటల్లో ఆ భారితనం కనపడుతుంది. ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు. కథ, కథనాలలో శ్రీకాంత్ మార్క్ మిస్ అయ్యింది. దర్శకుడి గత రెండు చిత్రాలలో కనిపించిన బలమైన కథ, కథనాలు, రొమాంటిక్ టచ్, సున్నితమైన హాస్య సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కడా కనిపించలేదు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, మేకింగ్ లో మాత్రం శ్రీకాంత్ అడ్డాల తన మార్క్ చూపించాడు.

తీర్పు :

ఓ ఇమేజ్ చట్రంలోకి వెళ్ళకుండా చాలా తెలివిగా డిఫరెంట్ కథతో వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక సినిమా విషయానికి వస్తే, వరుణ్ తేజ్ తర్వాత మిక్కి జె మేయర్ తన సంగీతంతో మెస్మరైజ్ చేశాడు. కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త భారంగా ముందుకు వెళ్తుంది. వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్, మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ, దర్శకత్వం, సెకండ్ హాఫ్ సినిమాకు మైనస్ పాయింట్స్. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లో అడుగుపెడితే సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.




TeluguWorld.wap.sh:-2.75/5




Users Online


1891